మాజీ ముఖ్యమంత్రి జయలలితకు స్లో పాయిజన్ ఇవ్వడం వల్లే ఆమె చనిపోయారని తమిళనాడు అటవీశాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం చెన్నైలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ జయను ఇంట్లో బందీగా ఉంచి మధుమేహం అధికమయ్యేలా స్లో పాయిజన్ ఇవ్వడంతో పాటు వేళాపాళా లేకుండా ఆహారం అందించారన్నారు. దీనికి కారణం దినకరన్ వర్గమేనని ఆరోపించారు. దినకరన్ తీరును గమనించిన జయ ఆయన్ని పదేళ్ల పాటు పార్టీ నుంచి తొలగించారని గుర్తు చేశారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో చేతులు కలిపి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు దినకరన్ పన్నిన కుట్రలు ఫలించబోవని ఆయన పేర్కొన్నారు.

