గత ఆరు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కటే టాపిక్.. అదే వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం. ప్రతిపక్ష నేతపై 'హత్యాయత్నం' జరిగిందంటే, అధికార పార్టీ సిగ్గుతో తలదించుకోవాలి. ఎందుకంటే, అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ముక్త కంఠంతో ప్రతి ఒక్కరూ ప్రభుత్వం తీరుని ఏకి పారేస్తుంటే, నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకుని.. 'టాపిక్‌ని డైవర్ట్ చేయడానికి' టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పడిన, పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.
ముఖ్యమంత్రి, డీజీపీ, మంత్రులు.. ఇలా ప్రభుత్వం తరఫున అందరిదీ ఒకటేమాట.. అదేదో సరదాగా జగన్ చేయించుకున్న దాడి అన్నట్లుగానే వుంది వ్యవహారం. ఓ అభిమాని, వైఎస్సార్సీపీ కార్యకర్త ఆ దాడి చేసినట్లు డీజీపీ ప్రకటించేయడమే శోచనీయం. నిజానికి, హత్యాయత్నం జరిగిన వెంటనే, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తో ముఖ్యమంత్రి మాట్లాడి వుండాలి. ఆసుపత్రిలో జగన్‌ని పరామర్శించి వుండాలి. అవేవీ చేయలేదు సరికదా, ఐదురోజుల తర్వాత 'జగన్‌తో ఫోన్‌లో మాట్లాడదామనుకున్నానుగానీ, నన్నే నేరస్తుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు..' అంటూ వైఎస్ జగన్ సొంతజిల్లా కడపలో మొసలికన్నీరు కార్చారు చంద్రబాబు.
రాజకీయాల్లో దిగజారుడుతనం గురించి పదే పదే మాట్లాడుకుంటూనే వుంటాంగానీ, ఈస్థాయి దిగజారుడుతనం గురించి ఎవరూ ఊహించి వుండరేమో. దాడి జరిగిన మాటవాస్తవం. అది ఎందుకు జరిగిందన్నది విచారణలో తేలుతుంది. విచారణ ఎలాగూ అధికార పార్టీ చెప్పినట్లుగానే జరుగుతుది కాబట్టి, చంద్రబాబు సర్కార్ కంగారు పడాల్సిన పనే లేదు. జగన్‌ని ఫోన్‌లో పరామర్శించేసి, వీలైతే ప్రత్యక్షంగా వెళ్ళి పరామర్శించి వుంటే.. చంద్రబాబు 'హుందాతనం' పెంచుకున్నట్లయ్యేది. ఆ తర్వాత రాజకీయ నాటకాలు.. వేరే వ్యవహారం. కానీ, ముఖ్యమంత్రి కాదు కదా.. మంత్రులు కూడా వైఎస్ జగన్‌ని పరామర్శించకపోవడం ఆశ్చర్యకరం.
ఇప్పుడు ఇదే, తెలుగుదేశం పార్టీలోనూ చిచ్చుపెట్టేలా కన్పిస్తోంది. 'నేను నిప్పు' అని చెప్పుకునే చంద్రబాబుకి, కనీసపాటి మానవత్వం కూడా లేదని ఆఫ్ ది రికార్డ్‌గా తెలుగు తమ్ముళ్ళే చెప్పుకుంటున్నారు. ఇంత దారుణమా.? ఇంత అమానవీయమా.? విలువల్లేని వ్యక్తితో రాజకీయ ప్రయాణం చేస్తున్నామా.? అని కొందరు టీడీపీ ముఖ్యనేతలు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారట. చంద్రబాబు అహంకారం పీక్స్‌కి వెళ్ళిపోయిందంటూ ఆఫ్ ది రికార్డ్‌గా వాపోవడం మినహా, ఆ అసంతృప్తిని చంద్రబాబు వద్ద వెల్లగక్కేంత సీన్ టీడీపీలో ఎవరికీ లేకపోవడం గమనార్మం.
'ఇంకో ఆరునెలల్లో ఎన్నికలొస్తాయ్.. ఆ తర్వాత పరిస్థితులు ఎలా వుంటాయో ఎవరు చెప్పగలరు.? ప్రతిపక్ష నేతను పరామర్శిస్తే చంద్రబాబు హుందాతనమే పెరిగేది.. పొలిటికల్ ఈక్వేషన్స్ మారి, జగన్ ముఖ్యమంత్రి అయితే.. చంద్రబాబు పరిస్థితి ఏంటి.?' అన్న చర్చ టీడీపీలోనే జరుగుతోందంటే.. చంద్రబాబు డైరెక్షన్‌లో నడుస్తోన్న 'కత్తి రాజకీయం' ఏ స్థాయిలో టీడీపీ వైపుకు బూమరాంగ్ అవుతోందో అర్థం చేసుకోవచ్చు.

