నాగార్జున, అమల కాంబినేషన్‌లో చాన్నాళ్ళ క్రితం తెలుగులో వచ్చిన 'శివ' అప్పట్లో ఓ సంచలనం. అప్పటికీ ఇప్పటికీ ఆ చిత్రం గురించి కొత్తగా చెప్పుకుంటూనే వున్నాం. ఆ సినిమాలోని కంటెంట్‌ అలాంటిది. క్యాంపస్‌ రాజకీయాల్ని కళ్ళకు కట్టినట్లు చూపించిందా చిత్రం. కాలేజీ కుర్రాడు, రౌడీయిజం.. రెండూ తలపడితే, అది కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో అయితే ఆ కిక్కే వేరప్పా.. అన్నట్లు సగటు సినీ అభిమాని ఆ సినిమాని ఓ రేంజ్‌లో ఎంజాయ్‌ చేశాడు.

తెలుగు సినీ పరిశ్రమలో టెక్నికల్‌గా టాప్‌ 10 చిత్రాల గురించి చెప్పుకోవాలంటే అందులో ఖచ్చితంగా 'శివ' వుంటుంది. ఆ సినిమాలోని కథ అలాంటిది. అందులో షాట్‌ డివిజన్‌ అలా వుంటుంది. డైలాగ్స్‌ ఆ రేంజ్‌లో వుంటాయి. ఒకటేమిటి, 'శివ'లో చాలానే వున్నాయి. యూత్‌ అయితే ఆ సినిమాతో కనెక్ట్‌ అయినట్లు ఆ తర్వాత ఇంకే సినిమాతోనూ అంతలా కనెక్ట్‌ అవలేదేమో.. అనడం అతిశయోక్తి కాదు.

ఇంతటి సంచలన చిత్రానికి దర్శకత్వం వహించిన వర్మ, తెలుగు సినిమాకి గుడ్‌ బై చెబుతానంటున్నాడు. చిత్రమేంటంటే, 'శివ' సినిమాకి ఏ బ్యాక్‌డ్రాప్‌ని అయితే ఎంచుకున్నాడో, అదే బ్యాక్‌డ్రాప్‌తో ఓ రియల్‌ స్టోరీని తెరకెక్కిస్తూ అదే తన చివరి చిత్రమని వర్మ ప్రకటించడం. విజయవాడ రౌడీ రాజకీయాలు, కాలేజీ గొడవలు.. ఇవన్నీ 'శివ' సినిమాలోని ముఖ్యాంశాలు. ఇప్పుడు ఆ రౌడీ రాజకీయాలు, కులాల కుంపట్లను 'వంగవీటి' చిత్రంలో చూపనున్నాడు వర్మ.

తన చివరి తెలుగు సినిమా 'వంగవీటి'లోని పాత్రల గురించీ వర్మ క్లారిటీ ఇచ్చాడు. అంతా బాగానే వుందిగానీ, 'వంగవీటి' కన్నా గొప్ప కథ, గొప్ప పాత్రలు తనకు భవిష్యత్తులో ఖచ్చితంగా దొరకవు కాబట్టి, ఆ విషయం తనకు తెలుసు కాబట్టి ఇక తెలుగు సినిమా మళ్ళీ చేయనని వర్మ ప్రకటించడమే ఇక్కడ కొసమెరుపు.

మహాభారతాన్ని మించిన కథ ఏముంటుంది.? రామయణానికి సాటి రాగల కథ ఏముంటుంది.? అనేవారెంతమందో వున్నారు. అసలు లోకంలో వున్నవే రెండో మూడో కథలనేవారూ లేకపోలేదు. వర్మ లాంటి సంచలన దర్శకుడు, తనకు కథలు దొరకవు.. గొప్ప కథలు దొరకవు గనుక రిటైర్మెంట్‌ తీసుకుంటున్నా.. అని ప్రకటించడం కాస్తంత వింతగానూ, చాలా విడ్డూరంగానూ అన్పించకమానదు. ఆయనంతే అదో టైపు. అందుకే ఆయన రామ్‌గోపాల్‌ వర్మ అయ్యాడు.

నిజానికి 'వంగవీటి' సినిమాకి పబ్లిసిటీ అవసరం లేదు. అంతటి పవర్‌ఫుల్‌ అంశాలు వంగవీటి వెనుక వున్నాయి. అయినా వర్మ, తన ట్రేడ్‌ మార్క్‌ పబ్లిసిటీ స్టంట్‌కి తెరలేపాడు. అదే తెలుగు సినిమా కెరీర్‌లో దర్శకుడిగా చివరి సినిమా అని. నమ్మేద్దామా.?