పెట్రోలు ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. పెట్రోలుపై పెంచిన సుంకాలను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని కొందరు, రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్రం, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సుముఖంగా లేవు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ అభ్యర్థికి ఓటేస్తే పెట్రోలు లీటరు 30 రూపాయలకే దొరుకుతుంది! అంతేకాదు.. పుట్టిన ప్రతి బిడ్డకూ ఉచితంగా 50 గజాల స్థలం కూడా లభిస్తుంది. ఆ అభ్యర్థి ఏ పార్టీయో కనుక్కుని అర్జంటుగా ఓటేసేద్దాం అనుకుంటున్నారా? ఆయన ఏ పార్టీ అభ్యర్థీ కాదు… ఇండిపెండెంట్‌ అభ్యర్థి! పెట్రోలు ధరలు తగ్గించడం మహా మహా బీజేపీ, టీఆర్‌ఎస్‌ వంటి ప్రధాన పార్టీలకే కష్టంగా ఉంటే ఇక ఇండిపెండెంట్లు ఇంతలా ఎలా తగ్గించగలరని ఆశ్చర్యపోకండి. కొందరు అభ్యర్థులే స్వయంగా ఇలాంటి హామీలిస్తున్నారు మరి!




హైదరాబాద్‌లో ఒక్కో నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులతో కలిపి 10 నుంచి 15 మంది వరకూ ఎన్నికల బరిలో ఉంటున్నారు. అంతగా గుర్తింపు లేని పార్టీల నుంచి కొందరు, స్వతంత్ర అభ్యర్థులుగా ఇంకొందరు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎన్నికల్లో జయాపజయాలపై వీరి ప్రభావం ఎంత ఉంటుందో తెలియదు కానీ, వీరు గుప్పిస్తున్న హామీలు మాత్రం స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. జాతీయ ప్రాంతీయ పార్టీలు కూడా ఇవ్వని హామీలను సైతం ఈ అభ్యర్ధులు ఇచ్చేస్తున్నారు. ఎల్‌బీనగర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటున్న ఒక అభ్యర్థి, తనను గెలిపిస్తే 2023 నాటికి లీటరు పెట్రోలు రూ.30లకే అందిస్తానంటూ హామీ ఇస్తున్నారు. అంతేకాదు… తెలంగాణలో పొలాలన్నింటినీ ఉచితంగా దున్నిస్తానని, చిల్లిగవ్వ చెల్లించకుండా లక్ష హెల్మెట్లు పంపిణీ చేస్తానని, రెండు వేల రూపాయలకే సైకిళ్లు అందజేస్తానని, పుట్టిన ప్రతీబిడ్డకు 50 గజాల స్థలం ఇస్తానంటూ సరికొత్త హామీలతో సంచలనం సృష్టిస్తున్నారు. అయితే ఇక్కడో ట్విస్ట్‌ ఉంది. ప్రతి హామీకీ ‘కండిషన్స్‌ అప్లయ్’ అంటూ ఆయనో ట్యాగ్‌లైన్‌ పెట్టారు.


ఇంటింటికీ పాలు


ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ఒక చిన్న పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతానంటున్న వ్యక్తి, మహిళల ఓట్లపై కన్నేశారు. ‘నన్ను గెలిపిస్తే ప్రతిరోజూ మీ ఇంటికిరెండు పాల ప్యాకెట్లు పంపిస్తా’నంటున్నారు. మరో 20 లీటర్ల మినరల్‌ వాటర్‌ బాటిల్‌ కూడా పంపిస్తారట!! మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు, ఏటా 20 వేల రూపాయల ఆర్ధిక సాయం చేస్తారట!! కాలేజీల్లో చదివే అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలు, అబ్బాయిలకు ఆండ్రాయిడ్‌ ట్యాబ్‌లు అందిస్తానంటున్నారు. ట్యాబ్‌లు ఇస్తే సరిపోదు. ఇంటర్‌నెట్‌ ఉండొద్దూ.. అదీ కూడా ఉచితమేనండీ బాబూ! ప్రధాన రాజకీయ పార్టీలు సాధ్యాసాధ్యాలు, ఉచితానుచితాలతో నిమిత్తం లేకుండా.. ఇంటి అద్దె కడతామని, కలర్‌ టీవీలు ఉచితంగా ఇస్తామని హామీలు ఇస్తున్నప్పుడు.. తామెందుకు ఇవ్వకూడదని ఇండిపెండెంట్లు కూడా భావిస్తున్నట్లుంది.


ఆడవాళ్లకు ఆటోలు..


జంట నగరాల్లో పెద్ద నియోజకవర్గం సికింద్రాబాద్‌. ఇక్కడి నుంచి మరో అభ్యర్థి స్వతంత్రుడిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈయన హామీలన్నీ ఆటో డ్రైవర్లకు చెందినవే కావడం విశేషం. తనను ఎన్నికల్లో గెలిపిస్తే 50 ఏళ్లు నిండిన ఆటో డ్రైవర్లకు నెలకు రూ.3 వేలు పింఛను ఇవ్వడంతో పాటు, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. ఇక డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలో ఆటో డ్రైవర్లకే అధిక ప్రాధాన్యం కల్పిస్తారట!! 60 శాతం సబ్సిడీతో ఆటోలను అందజేస్తానంటున్నారీ ఆటో లీడర్‌. మహిళా ఆటో డ్రైవర్లకైతే 90 శాతం సబ్సిడీతో ఆటోలను ఇస్తానంటున్నారు.